Friday, January 3, 2014

స్థానిక సమరంలో ఓ విజయమ్మ కథ





ఏమి విజయమ్మా! ఈరోజు పిల్లలకు ఏమి వండి పెడుతున్నావు?
ఏముంది సారూ! అన్నమూ , సాంబారూ , రసమూను
అవునూ!   ఈ రోజు మంగళ వారం కదా!
అర్థమయ్యింది సారూ , మంగళవారం గుడ్లు వండాలని కదా మీరనేది
మరి ! “
ఒక్కొక్క పిలగాడికి రూపాయి పావలా ఇస్తున్నారు .  గుడ్డు రొండు రూపాయలు . వారానికి
రెండు సార్లు ఏడ దెచ్చేది . మీకు దెలవందేముంది సారూ .  అదికూడా నాలుగు నెలలకోసారి                     బిల్లు లిస్తున్నారు . బతుకు దెరువు లేక బడి పిల్లలకు వండి పెట్టడానికి ఒప్పు కుంటిని .
ఏమి చేసేది ?
     నేను గవర్ణమెంటు హైస్కూలు ప్రథానోపాధ్యాయులుగా ఉద్యోగం వెలగబెట్టినప్పటి ముచ్చట .                   నా స్కూల్ కాంప్లెక్సు పరిధిలోని కొన్ని ప్రాథమిక పాఠశాలలు సందర్శించిన సందర్భమిది .  
                                         -----
     పదేళ్ళ క్రితం ఈ విజయమ్మ ఆ మండలానికి మండలాథ్యక్షురాలు . ఆ వూరి యం.పి.టి.సి
యస్.సి మహిళకు రిజర్వు కావడం వల్లా , ఆ ఊరి చక్రం తిప్పే బడా నేత ఎంపిక చేయడం వల్లా
విజయమ్మ యం.పి.టి.సి అయ్యింది .
      మండలాథ్యక్ష పదవి కూడా జనరల్ మహిళకు రిజర్వు కావడం వల్లా - మండలంలో
గెలిచిన యం.పి.టి.సి లలో విజయమ్మ ఒక్కరే మహిళ కావడం వల్లా అనూహ్యంగా మండలా
థ్యక్ష పదవి ఆమెను వరించింది .
        అంతకు క్రితం ఆ మండలానికి మండలాథ్యక్షుడుగా ఉన్న ఉన్నత సామాజిక వర్గానికి
చెందిన రాజకీయ నాయకుడు బలాఢ్యుడు . అంగ బలం , అర్థ బలంతో ఆ మండలంలో ఆయన హవానే                      నడుస్తూ ఉంది .
        ఇక షరా మామూలే . మండలాథ్యక్షురాలు విజయమ్మ ప్రతిరోజూ పొద్దున్నే సదరు శ్రీవారి
ఇంటికి వెళ్ళడం , సాయంత్రం వరకూ ఆయింటి యజమానురాలు చెప్పిన పనులు చేయడం ,                           రాత్రికి ఇల్లు చేరడం – ఇదీ విజయమ్మ దిన చర్య .
        విజయమ్మకు పొడి పొడిగా సంతకం చేయడం నేర్పించినారు . చెక్కులూ , ఉత్తర్వులూ ,
తదితరాల మీద అయ్యగారి ఇష్టాయిష్ఠాల మేరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టడం ,
అప్పుడప్పుడు జరిగే సమావేశాలలో ఒక అనామకురాలి లాగా బిక్కు బిక్కుమంటూ కూర్చోడంవరకే.
        అధికారులూ , అనధి కారులూ ఆమెనసలు మండలాథ్యక్షురాలిగా భావించిన దాఖలాలు
కనబడవు . అధికారమూ . ఆర్భాటమూ అంతా ఆ పెద్దాయనదే మరి . విజయమ్మ నామ మా
త్రం గానే మిగిలి పోయింది . పదవి పోయిన తర్వాత బతుకు తెరువు కోసం నానా పాట్లూ పడుతున్న
ఇలాంటి విజయమ్మలను చూస్తున్నప్పుడు మనస్సు చివుక్కు మంటోంది . ఇది పదేళ్ళ నాటి
సంగతి . ఐనా , మార్పు కోసం ఆసించడం తప్ప ఎక్కడా ఆ ధాఖలాలు సుదూరంగా కూడా                    కనిపించడం లేదు .
                                        -----  
         ఉన్నత సామాజిక వర్గాల మహిళలతో సహా స్త్రీలూ , బడుగు – బలహీన వర్గాలూ స్థానిక
రిజర్వేషన్ల ద్వారా అందిన పదవులను అనుభవించే పరిస్థితులే లేవు . అధికారమంతా రాజకీయ ,
సామాజిక , ఆర్థిక బలాఢ్యుల చేతుల్లోకి బదిలీ అవుతున్నప్పుడు , బడుగు బలహీన వర్గాల అభ్యున్న
తి ప్రశ్నార్థకమే .
         ఈ సామాజిక దురవస్థకు కారణం మనకు తెలుసు . నిరోధించడానికి మన బాధ్యతగా ఈ సమాజానికి మనమేమి చెప్పాలో యోచించండి .  


Wednesday, May 9, 2012

ఏది సత్యం ? ఏదసత్యం ?


ప్రియమైన విద్యార్థులారా !  

                                                                                                                          

                       సైన్సులో మీకు సూర్యుడు – శక్తి పాఠం ఉంది కదా !  మీ సైన్సు టీచరు సూర్య గోళాన్ని గురించి ఏమి చెబుతాడు ? వాయువుల తోటి మండే గోళమని కదా ! మరి తెలుగు పాఠాన్ని బోధిస్తూ మీ తెలుగు టీచర్ ఏమి చెబుతాడు?  సూర్యనారాయణుడనీ , దేవుడనీ కదా !  

                అంటే మీ పాఠశాలలో ఒకే అంశానికి రెండు విరుధ్ధ భావనలు బోధించి మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తున్నారన్నమాట !  ఇందులో ఏది నిజమో పరిశీలించండి . శాస్త్రీయంగా నిరూపింప బడేదే సత్యం . శాస్త్రీయంగా నిరూపించ లేనిది అసత్యమే కదా మరి ! పాఠశాలలో అసత్యాలు బోధించడం సముచితమేనా ?

                 సూర్యుడు కేవలం వాయువులతో నిండి నిరంతరం మండే వాయుగోళం . ఇది శాస్త్రీయంగా నిరూపించ బడింది . ఇది సత్యం . సూర్యున్ని భగవంతుడుగా చిత్రీకరించే కథలన్నీ అసత్యాలు  .....       

                        --- ఇలా అనర్గళంగా సాగిపోతూ ఉంది ఆనాటి పాఠశాల సమావేశంలో ఒక మేథావి ఉపన్యాసం . ఆ మేథావి ఆనాటి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసిన విశిష్ట ఉపన్యాసకులు . మీదు మిక్కిలి హేతువాది . సదరు ఉపన్యాసకులు మంచి స్ఫురద్రూపి . మంచి వాగ్ధాటితో , చతురోక్తులతో విద్యార్థులను ఆకట్టుకొని మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు .

                 ఇంతలో ఆపాఠశాల తెలుగు టీచర్ వేదిక మీదకు వచ్చి , తనకూ సదరు అంశం మీద మాటాడ్డానికి అవకాశం ఇవ్వవలసినదిగా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్మాష్టరు గారిని కోరినాడు .

                  ప్రధానోపాధ్యాయుని సంశయాన్ని గమనించిన హేతువాది తన ఉపన్యాసాన్ని అర్థాంతరంగా ఆపి , తెలుగు టీచర్ను మాటాడ వలసినదిగా కోరినాడు . సమావేశ వేదిక కాస్తా చర్చావేదికగా మారింది .

                   వేదిక మీదకు వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల లో కొంత మందిని లేపి  వారి తల్లి దండ్రుల వేర్లు చెప్పవలసినదిగా కోరినాడు . వారు చెప్పినారు .                                                            మీరు మీ తల్లిదండ్రులను ఏమని పిలుస్తారు? “   టీచరు ప్రశ్న

అమ్మా – అనీ , నానా – అనీ   పిల్లల సమాధానం

పేర్లతో పిలవరా ?  టీచరు

తప్పుకదండీ ! “ పిల్లలు

                ప్రియమైన విద్యార్థులారా! తల్లిదండ్రుల మీదా , గురువుల మీదా , పెద్దల మీదా మనకుండే గౌరవం వల్ల మనం వాళ్లను పేర్లతో సంబోధించడం తప్పుగా భావిస్తున్నాము .

                  సూర్యుడు మండే గోళం మాత్రమే కాదు . సూర్యుడు భూమిమీది సర్వజీవ రాశికీ శక్తి ప్రదాత . సూర్యగోళం నుండి వెలువడే అనంతమైన శక్తి వల్లనే ఈ భూమిమీది సర్వ జీవ రాశీ మనుగడ సాగిస్తోంది . సూర్యకిరణాలు భూమికి చేరని నాడు భూమిపై జీవరాశి నశిస్తుంది . ఇది కూడా శాస్త్రీయ మైన అంశమే .

                  మన మనుగడ కు నిరంతరం శక్తిని ప్రసాదించే సూర్యుణ్ణి గౌరవించి , దైవంగా భావించి , ఆరాధించడం ఎంత మాత్రమూ తప్పు కాదు . మానవ జాతి మనుగడకు దోహద కారులైన ఏ అంశాలనైనా గౌరవించి దైవంగా భావించి , ఆరాధించడం అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతీ –సంప్రదాయాల లో ఉన్న గొప్పదనం . భారతీయ సంస్కృతి మానవజాతి ఉన్నతికి ప్రతీక .

                 ఇలాగే నేల . నేలంటే మన్నేకదా !  నేలే మనకు ఆధారం . ఇందులోనే మనం ఆహారాన్ని పండించు కొంటున్నాం . అందరికీ అన్నం పెట్టే నేలను తల్లీ అనడం తప్పా? అనక పోవడం తప్పా ?

                 నీరు , గాలి . ప్రకృతి – ఇలా మన మనుగడకు ప్రత్యక్షంగా గానీ , పరోక్షంగా గానీ దోహదకారులయ్యే ప్రతి అంశాన్నీ విథిగా గౌరవించాలి .

                 అందుకే సూర్యణ్ణి సూర్యభగవానుడనీ , నేలను నేలతల్లిగా , ప్రకృతిని ప్రకృతి మాతగా మనం గౌరవించడం – ఆరాధించడం నేర్చుకున్నాము . గౌరవించక పోవడం తప్పు . ఆరాధించక పోవడం నేరం . అనాదిగా మనకు సంక్రమించిన ఈ సంప్రదాయాన్ని వదులుకోవద్దు .        అని ముగించినాడు . కరతాళ ధ్వనులతో సమావేశ మందిరం మారు మ్రోగింది . పాపం హేతువాది ఎటు వెళ్ళేడో మరి !